Komali Suicide Case

Komali Suicide Case: కోమలి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మారిన సీన్!

Komali Suicide Case: హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఉన్న చిత్రపురి కాలనీలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అయితే, ఈ కేసులో తాజాగా కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డి పోలీసుల ముందుకు రావడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోమలి మరణానికి అఖిల్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆరోపిస్తున్నారు.

అఖిల్ ఏమంటున్నారంటే?
పోలీసుల విచారణలో అఖిల్ రెడ్డి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తాను, కోమలి గతంలో ప్రేమించుకున్న మాట నిజమేనని, కానీ కొంతకాలం క్రితమే తాము విడిపోయామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను వేరే యువతితో రిలేషన్‌లో ఉన్నానని, ఆ విషయం కోమలికి స్పష్టంగా చెప్పానని అఖిల్ పేర్కొన్నారు. “నన్ను వదిలేయ్” అని తాను కోరినప్పటికీ, కోమలి వినకుండా తనను ఇబ్బంది పెట్టిందని ఆయన పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివరించారు.

పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలు:
రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్, కోమలి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఆమె తల్లికి కూడా తెలుసు. ఏడాది క్రితమే తల్లి సమక్షంలో వీరిద్దరూ ఈ విషయంపై మాట్లాడుకున్నారు. అయితే, ఆత్మహత్యకు ముందు కోమలి తన తల్లికి ఒక ఎమోషనల్ మెసేజ్ పంపింది. “ఐ లవ్ యూ మమ్మీ.. తమ్ముడిని బాగా చూసుకో, జాగ్రత్త” అంటూ ఆ సందేశంలో పేర్కొంది. కోమలి రాసిన సూసైడ్ లెటర్‌లో కూడా అఖిల్ పేరు ఉన్నట్లు సమాచారం.

షాక్‌లో ఇరుగుపొరుగు వారు:
కోమలి నివసించే ఫ్లాట్ ఎదురుగా ఉండే మహిళ ఆమె గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. కోమలి అందరితో చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉండేదని.. అసలు ఆమెకు ప్రేమ సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని తెలిపారు. సంక్రాంతికి అందరం కలిసి టూర్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని, తాను కూడా వస్తానని కోమలి చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఇంతలో ఇలాంటి ఘోరం జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం పోలీసులు అఖిల్ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తూ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *