Anantapur: ఎలా తెలిసిందో ఏమో కాని మొత్తానికి ..అంత మొత్తం అక్కడ ఉంది తెలిసింది. ఎంత మొత్తం అంటే అక్షరాలా కోట్ల రూపాయల ప్రాపర్టీ. వచ్చారు ..దోచేశారు , వెళ్లిపోయారు. మరి …అక్కడే అంత మొత్తం ఉంది అని ఆ ముఠాకు ఎవరికి హిప్పారు. కూతురు పెళ్లి కోసం భద్రంగా దాచిన ఆ సొమ్ము ..ఇప్పుడు మాయమయింది. ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరు ? రంగంలోకి పోలీసులు దిగారు . తెలిసిన వారి పనేనా లేక …వేరే కారణాలు ఉన్నాయా ?
అనంతపురంలోని సవేరా హాస్పిటల్ సమీపంలోని రాజహంసా విల్లాస్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.
శివారెడ్డి ఇంట్లో దాచి ఉంచిన 3.50 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, 25 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. వీటిని ఫిబ్రవరి 7న తన కూతురు వివాహం కోసం దాచి ఉంచినట్లు శివారెడ్డి తెలిపారు. దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మొత్తం మూడు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయని సమాచారం. పొరుగునే ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇళ్లలోనూ దోపిడీ జరిగింది.ఓ ఇంట్లో దొరక్కపోవడంతో దుండగులు వెనక్కి వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు.
చోరీ ఘటనపై బిజినెస్‌మెన్ శివారెడ్డి మాట్లాడుతూ, “నా కూతురి పెళ్లి కోసం ఉంచిన బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. మా ఇంటితో పాటు పక్కింటిలో కూడా దొంగతనం జరిగిందని సెక్యూరిటీ ద్వారా సమాచారం అందింది. కూతురి వివాహం కోసం పెళ్లి పత్రికలు ఆహ్వానం ఇచ్చేందుకు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.