BhuBharati: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం తొలుత మూడు మండలాల్లోనే అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఆయా మండలాల్లో ఈ చట్టాన్ని మొదలు అమలు చేస్తారు. ఈ మేరకు ఈ భూభారతి చట్టం అమలుకు ఈ రోజే (ఏప్రిల్ 14) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు.
BhuBharati: భూభారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. ఆయా మండలాల్లో చట్టం అమలులో వచ్చే సమస్యలను అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుడుతారు.
BhuBharati: ముందుగా ఆ మూడు మండలాల్లో క్షేత్రస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి భూభారతి చట్టం అమలులో సాధక బాధకాలను పరిశీలిస్తారు. రైతుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. వాటి ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి భూభారతి చట్టాన్ని అమలు చేయనున్నారు.
BhuBharati: కోటి మంది రైతులు ఒకేసారి లాగిన్ అయినా సర్వర్ పనిచేసేలా భూభారతి యాప్‌ను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూభారతి లోగోలో తెలంగాణ తల్లి రూపాన్ని ముద్రించారు. భూభారతి చట్టంపై ఎవరైనా గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రైతులకు గతం కంటే మెరుగైన సేవలందించాలన్న ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
BhuBharati: ఈ మేరకు భూభారతి చట్టం అమలుకు ముందు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో సమావేశం అవుతారు. చట్టంపై వివిధ స్థాయిల్లో వారితో చర్చిస్తారు. వారికి మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు భూభారతి చట్టం అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుడుతారు. భూభారతి చట్టం ఆరంభమైన తర్వాత ధరణి చట్టం ఉండబోదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.