Bhoomika: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రజాసేవ వైపు అడుగులు వేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని ఆమె ప్రశంసించారు. పవన్ కల్యాణ్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడుతూ, ఆయన విజయ ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న భూమిక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఖుషి’ సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన రోజులు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. నటుడిగా అపారమైన స్టార్డమ్ సాధించి, రాజకీయాల్లోకి ప్రవేశించి అనేక సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
భూమిక పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని, ప్రజలకు మరింత గొప్ప సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భూమిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
