bhatti vikramarka: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు గురుకుల విద్యాలయాలను సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గురుకులాల నిర్వహణ, స్టడీ సర్కిళ్లు, గ్రామీణాభివృద్ధి, రవాణా, విద్యుత్ శాఖల పనితీరుపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభం అయ్యే సమయానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందుబాటులో ఉండేలా ముందే నిధులు విడుదల చేశామని తెలిపారు. అవసరమైతే సరైన వసతులు లేని గురుకులాల కోసం ప్రత్యామ్నాయ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి గురుకులంలో మెష్ జాలీలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో మరమ్మత్తులు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం డైట్ చార్జీలను 40%, కాస్మొటిక్ చార్జీలను 200% పెంచినట్లు చెప్పారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యేలు గురుకులాలను తరచూ పరిశీలించాలని, ఇందుకోసం షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమంపై కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.