Bhatti vikramarka: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ సేవలు ఘనవిజయం సాధించాయి. ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదవడంతో, మహిళలు సుమారు రూ. 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో “మహాలక్ష్మి సంబరాలు” నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. మహిళల ప్రయాణానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడుతోందని, వాటి ప్రభావంతో టీఎస్‌ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే, 2023 డిసెంబర్ 9న ‘ఇందిరమ్మ ప్రభుత్వం’ మహిళల ఉచిత బస్సు ప్రయాణ సేవను ప్రారంభించింది అని ఆయన గుర్తు చేశారు. ప్రారంభంలో “మునిగిపోతున్న పడవ” అంటూ విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి రావడం ఈ పథకం విజయాన్ని చాటిందని భట్టి విక్రమార్క అన్నారు.
200 కోట్ల ఉచిత ప్రయాణికుల ఛార్జీలకు సమానమైన రూ. 6,680 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ మహిళల ప్రయాణాలకు రాష్ట్రమే ఖర్చులను భరించనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేయగలిగినంతవరకు ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెప్పారు. ఉచిత బస్సు సేవలు వల్ల మహిళలు ఉద్యోగాలకు, ఆలయాలకు, షాపింగ్‌లకు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారని ప్రశంసించారు.

