Bhatti vikramarka: అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు

Bhatti vikramarka: రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాల్లో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించాల్సిన కేసీఆర్, మీడియా ముందు ఆరోపణలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టివిక్రమార్క మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదని తేల్చిచెప్పారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.12,500 కోట్లను విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని భట్టివిక్రమార్క వెల్లడించారు. ఇది రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతాయుత చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నాయకులు దిగజారి మాట్లాడుతూ “తోలు తీస్తాం” వంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని భట్టివిక్రమార్క అన్నారు. తాము ఆ స్థాయికి దిగజారలేమని స్పష్టం చేస్తూ, అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారని భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రజల ప్రశ్నలకు, ప్రభుత్వ పనితీరుపై చర్చకు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయన అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *