Bhatti vikramarka: ఆ పార్టీ నేతలు భయపడి సభను వదిలి వెళ్లారు

Bhatti vikramarka: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడమే బీఆర్ఎస్ వైఖరని మండిపడ్డారు.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బీఏసీ (BAC)లో బీఆర్ఎస్ పట్టుబట్టిందని భట్టి గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం చర్చకు సిద్ధమవ్వగానే, సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు భయపడి సభను వదిలి వెళ్లారని ఆరోపించారు.

“ఏదైనా అంశంపై ఇబ్బంది అనిపించిన రోజున వాకౌట్ చేస్తే అర్థం ఉంది. కానీ మిగతా రోజులన్నీ సభకు ఎందుకు రాలేదో బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలి” అని భట్టి ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఇక శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురైన అంశంపై స్పందించిన భట్టి, ఆమె మాట్లాడిన ప్రతి మాట సభ రికార్డులో నమోదైందని తెలిపారు. సభలో జరిగిన పరిణామాలన్నింటినీ ప్రభుత్వం గమనిస్తోందని, నిబంధనల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి రాష్ట్రాలపై భారం మోపుతున్న విషయంపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే కాదా అని భట్టి ప్రశ్నించారు.

“ఉపాధి హామీ పథకం బీఆర్ఎస్‌కు ఇంపార్టెంట్ కాదా? పేదల సమస్యలను మీరు గుర్తించారా లేదా? చర్చలో పాల్గొనకుండా సభను బహిష్కరించడం ప్రజలకు చేసిన అన్యాయమే” అని ఆయన ఫైర్ అయ్యారు.

శాసనసభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని భట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలపై ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *