CM Chandrababu

CM Chandrababu: 2047 నాటికి ప్రపంచ శక్తిగా భారత్ – సీఎం చంద్రబాబు.

CM Chandrababu: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వేదికగా ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. సమ్మేళనంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ శాస్త్రీయ, సాంకేతిక స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అక్కడ యువ శాస్త్రవేత్తలు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలను చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ భారతదేశ విజ్ఞాన సంపదను, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. మన దేశంలో నాలెడ్జ్‌కు కొదవ లేదని, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుతున్నప్పటికీ, భారత్‌లో ఉన్న మానవ వనరులు మనకు పెద్ద బలమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు.

Also Read: Russia: చంద్రుడిపై అన్వేష‌ణ‌లో ర‌ష్యా మ‌రో ముంద‌డుగు

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెబుతూ రాష్ట్రంలో రానున్న మెగా ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు. తిరుపతిలో ‘స్పేస్ సిటీ’, కర్నూలులో ‘డ్రోన్ సిటీ’, అనంతపురంలో ‘ఏరో స్పేస్ సిటీ’, విశాఖలో ‘మెడ్ టెక్ పార్కు’ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో తాను హైదరాబాద్‌లో ఐటీని ప్రోత్సహించడం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అత్యధిక వేతనాలు పొందుతున్నారని గుర్తు చేశారు. అమరావతిలో ‘క్వాంటం కంప్యూటింగ్‌’ను, విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వస్తున్న గూగుల్ ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

కేవలం భౌతిక అభివృద్ధే కాకుండా మానసిక ప్రశాంతతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సీఎం సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని చెప్పారు. మన సంస్కృతిపై పిల్లల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెబుతూ, హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణాల్లోని హనుమంతుడు, అర్జునుడు గొప్ప బలవంతులని వారికి వివరించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పదవులను ఆశించకుండా సమాజ సేవ చేస్తున్న మోహన్ భగవత్ వంటి వారి కృషి అభినందనీయమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *