Bhadradri Kothagudem: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. పెద్ద ఎత్తున చేరుకున్న వారంతా అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని దహనం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో తాజాగా చోటుచేసుకున్నది. ఈ ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున చేరుకున్న అల్లరి మూకలు అక్కడి కార్యకర్తలపైనా దాడులకు దిగారు.
Bhadradri Kothagudem: కాంగ్రెస్ జెండాలు, కండువాలు కప్పుకున్న వారంతా ఒక్కసారిగా తరలివచ్చి దాడికి పాల్పడ్డారు. అక్కడికి పోలీసులు వచ్చినా నిలువరించలేకపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ ఈ దాడికి పాల్పడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోనే ఉన్న జెండా గద్దెను ధ్వసం చేసి కార్యాలయంలో చిందరవందర చేసి ఎదుట సామగ్రినంతా పోగేసి తగులబెట్టారు.
Bhadradri Kothagudem: బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పార్టీ కార్యాలయంపై మరో పార్టీ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర పరిణామంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. దీనిపై తగు విచారణ జరిపి, బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాజకీయ విభేదాలతో దాడి చేశారా? ఏదైనా కక్షాపూరితంగా చేశారా? అన్నది తేలాల్సి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తమ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఈ దాడికి దిగినట్టు తెలుస్తున్నది.

