Betting Apps Case:బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపులు తిరుగుతున్నది. ఇప్పటికే హైదరాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో 25 మందికి పైగా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ ఈ కేసుపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అక్కడ కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈడీ, సీబీఐ విభాగాలు కూడా ఈ యాప్స్ కేసుపై ఓ కన్నేసి ఉంచారు. భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కేసుల నమోదుతో దేశవ్యాప్తంగా ఒక చలనం వచ్చింది. పలు గేమింగ్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించే పనిలో పడింది.
Betting Apps Case:ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్‌స్టేషన్‌లో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీయాదవ్‌పై ఈ నెల 5న సుమోటోగా కేసు నమోదై ఉన్నది. పోలీసులు ఆయన కోసం గత కొన్నాళ్లుగా వెతుకుతున్నా, ఆచూకీ దొరకడం లేదని, పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ దశలోనే అతను విదేశాల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఎక్కడ ఉన్నా త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు విదేశాల నుంచి అతడిని రప్పించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
Betting Apps Case:బయ్యా సన్నీయాదవ్ బైక్‌పై రైడ్ చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లల్లో నగదును సంపాదించాడని ఆరోపణలు వచ్చాయి. నూతన్‌కల్ మండలంలోని తన సొంత గ్రామంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నట్టు తన సోషల్ మీడియా వేదికలోనే అతనే చెప్పినట్టు తెలిసింది. ఈ దశలో అతనిపై పోలీస్ కేసు నమోదు కావడంతో విదేశాలకు పారిపోయినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Betting Apps Case:ఇదిలా ఉండగా, తనపై లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో బయ్యా సన్నీయాదవ్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నూతనకల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

