Rana Daggubati: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు.
అసలేం జరిగింది?
బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన సెలబ్రిటీలకు ఈడీ గతంలో సమన్లు జారీ చేసింది. మొదటగా, జులై 23న రానా విచారణకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ అధికారులు రానాకు ఆగస్టు 11న హాజరుకావాలని కొత్తగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు. జులై 30న నటుడు ప్రకాశ్ రాజ్ మరియు ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు, ఈ నెల 13న నటి మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరుకానున్నారు.
ఈడీ విచారణకు కారణం ఇదే!
పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలలో లోన్ యాప్‌ల మీద నమోదు అయిన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసును నమోదు చేసింది. లోన్ యాప్‌ల ప్రచారకర్తలుగా వ్యవహరించిన 29 మంది సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల జాబితాను ఈడీ సిద్ధం చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో సహా మరెంతో మంది పేర్లు ఉన్నాయి.
విచారణలో భాగంగా మంచు లక్ష్మి తర్వాత మరికొంతమంది సెలబ్రిటీలను కూడా ప్రశ్నించడానికి ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.