Iran President: దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్‌లో ఉధృతంగా ఉన్న నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది వినగానే అంతర్జాతీయ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే కేవలం కొన్ని నెలల క్రితమే ఇరు దేశాలు 12 రోజుల యుద్ధంలో ప్రాణహాని కలిగించుకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వేలాది ఇరానీయులు ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ ప్రతీకార దాడుల్లో అనేకమంది ఇజ్రాయెలీయులు మృతి చెందారు.
ఇరాన్ పరిస్థితి ఆందోళనకరం
ప్రస్తుతం ఇరాన్ నీటి కొరతతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో నదులు, ఆనకట్టలు ఎండిపోయి, భూగర్భ జలమట్టాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సైతం “మన దగ్గర నీరు లేదు” అని బహిరంగంగానే అంగీకరించారు. దేశంలోని 90 శాతం ప్రాంతాలు కరువు పరిస్థితుల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయితో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
ఇది కూడా చదవండి: Ontimitta ZPTC by-election: ఒంటిమిట్టలో టీడీపీ విజయదుందుభి..
‘ది గ్లోబలిస్ట్’ నివేదిక ప్రకారం, ఇరాన్ నీటి సంక్షోభానికి పెద్ద కారణం వ్యవసాయ రంగంలో అధిక నీటి వినియోగం. సుమారు 9 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ప్రతి సంవత్సరం 100 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తోంది. ఇది పొరుగు దేశమైన టర్కీ వినియోగం కంటే దాదాపు రెట్టింపు.
టెహ్రాన్ అసంతృప్తి – సోషల్ మీడియాలో ఘాటైన ప్రతిస్పందన
ఇజ్రాయెల్ సహాయం ప్రతిపాదన టెహ్రాన్‌కు అంతగా నచ్చలేదు. అధ్యక్షుడు పెజెష్కియన్ సోషల్ మీడియా ‘X’లో నెతన్యాహు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “గాజా ప్రజల నుండి నీరు, ఆహారాన్ని లాక్కుంటూ… ఇప్పుడు ఇరాన్‌కు నీటిని అందిస్తారా? ఇది కేవలం నటన మాత్రమే” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన, “ఆకలి, దాహం, మందుల కొరతతో పోరాడుతున్న గాజాలోని అమాయక పిల్లల బాధను ముందుగా తీర్చండి… తర్వాతే ఇతరులపై తప్పుడు సానుభూతి చూపండి” అని తిప్పికొట్టారు.
భవిష్యత్ సంబంధాలపై ప్రశ్నార్థక చిహ్నం
ఈ ‘నీటి సహాయం’ ప్రతిపాదన ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. అయితే, గతంలో ఒకరిపై ఒకరు కఠిన వైఖరిని తీసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు ఒకే సమస్యపై చర్చకు రావడం ప్రపంచ రాజకీయాల్లో ఓ కొత్త మలుపుగా భావించవచ్చు.