Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత భయంకరమైన సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలకు గాలం వేసి, పార్టీల పేరుతో పిలిపించి, వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిఖిల్ (35), అతని అనుచరుడు డిక్సన్ సాండ్రో (21) సహా మరికొందరు కలిసి సుమారు 19 మంది యువతులపై ఈ తరహా దారుణాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. జక్కూరులోని ఒక ప్రైవేట్ విల్లాలో ఈ అఘాయిత్యాలు జరిగినట్లు సమాచారం.
ఇన్ స్టాగ్రామ్ స్నేహం.. పార్టీ పేరుతో మత్తుమందు
ఈ దారుణానికి నిందితులు పక్కా ప్లాన్ వేసేవారు. మొదట నిందితుడు డిక్సన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా కాలేజీ అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. వారిని నమ్మించి, తన స్నేహితుడు నిఖిల్ నడుపుతున్న విల్లాలో జరిగే పార్టీలకు ఆహ్వానించేవాడు.
తాజాగా ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఒక ప్రైవేట్ విల్లాలో జరిగిన పార్టీకి వచ్చిన ఒక బాధితురాలి ఫిర్యాదుతో ఈ దారుణాలన్నీ బయటపడ్డాయి. ఆ యువతికి బలవంతంగా పింక్ కలర్ డ్రగ్ టాబ్లెట్ ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత నిఖిల్, డిక్సన్ మరియు వారి గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కోలుకున్నాక పోలీసులను ఆశ్రయించడంతో ఈ రాకెట్ బయటపడింది.
19 మంది బాధితులు.. నిందితుల అరెస్ట్
కేవలం ఒక్కరే కాదు, ఈ ముఠా గత కొంతకాలంగా ఇదే పద్ధతిలో సుమారు 19 మంది అమ్మాయిలను వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు విల్లాలో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అమ్మాయిలపై దాడులను చిత్రీకరించేవారని, వాటితోనే వారిని బెదిరించేవారని తెలుస్తోంది.
అమృతహళ్లి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే నిఖిల్ మరియు డిక్సన్‌ను అరెస్ట్ చేశారు. వారి ఫోన్లను సీజ్ చేసి డేటాను విశ్లేషిస్తున్నారు. కాగా, నిందితులు తమను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారంటూ బాధితురాలిపైనే కౌంటర్ కంప్లైంట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.
