PVR-INOX: సినిమాను షెడ్యూల్ చేసిన సమయానికి ప్రారంభించకుండా 25 నిమిషాలు ప్రకటనలు ప్రదర్శించినందుకు ప్రముఖ PVR సినిమాస్‌పై బెంగళూరు జిల్లా వినియోగదారుల కోర్టు రూ.1.28 లక్షల జరిమానా విధించింది.
కార్పొరేట్ సంస్థ అయిన PVR సినిమాస్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో థియేటర్లను నిర్వహిస్తోంది. డిసెంబర్ 26, 2023న, అభిషేక్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులిద్దరితో కలిసి బెంగళూరులోని ఓరియన్ మాల్‌లోని PVR-ఐనాక్స్ థియేటర్‌లో సామ్ బహదూర్ సినిమా చూడటానికి వెళ్లాడు.
సినిమా సాయంత్రం 4:05 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రకటనలు, సినిమా ట్రైలర్‌లను 25 నిమిషాల పాటు ప్రదర్శించారు. తరువాత 4:30 గంటలకు, సామ్ బహదూర్ సినిమా ప్రదర్సించారు.
దీనిపై అభిషేక్ బెంగళూరు జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. నిర్ణీత సమయంలో సినిమా ప్రారంభించకుండా ప్రకటనలను ప్రదర్శించడం వల్ల తనకు మానసిక క్షోభ కలిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రకటనల ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ విషయంలో విచారణ సందర్భంగా హాజరైన పివిఆర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, సినిమాకు ముందు ప్రభుత్వ ప్రజా సేవా ప్రకటనలను ప్రదర్శించారంటూ చెప్పారు. ప్రజల ప్రయోజనం కోసం దీనిని ఏర్పాటు చేశామని కోర్టుకు చెప్పారు. అంతేకాకుండా పిటిషనర్ అనుమతి లేకుండా థియేటర్‌లో ప్రదర్శించిన ప్రకటనలను చిత్రీకరించారని వాదించారు.
అయితే, దీనిని కోర్టు తోసిపుచ్చుతూ, ‘ప్రజా సేవా ప్రకటనలను 10 నిమిషాలు మాత్రమే ప్రదర్శించాలి అని స్పష్టం చేసింది. అంతేకాకుండా అతను వీడియో రికార్డ్ చేసింది ప్రకటనలే తప్ప సినిమా కాదని.. అందుకు అనుమతి అవసరం లేదనీ కోర్టు పేర్కొంది. తరువాత కోర్టు తన ఆదేశాల్ని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Delhi CM Rekha Gupta: నేడు కొత్త సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకార.. ఈ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా
పిటిషనర్ సమర్పించిన ఆధారాల ప్రకారం, సినిమా ప్రారంభానికి ముందు ఉంచిన ప్రకటనలలో 95 శాతం ప్రైవేట్ కంపెనీలకు చెందినవి. వివిధ పనులతో బిజీగా ఉండే వ్యక్తులు అనవసరమైన ప్రకటనలను చూడటం చాలా కష్టం. వాళ్ళు కుటుంబంతో, స్నేహితులతో సినిమా చూడటానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి వేరే పని లేదని కాదు. నేటి ప్రపంచంలో, సమయం డబ్బు. ప్రతి ఒక్కరి సమయం విలువైనది. ఒకరి సమయాన్ని దోచుకుని డబ్బు సంపాదించే హక్కు ఎవరికీ లేదు అంటూ కోర్టు తన పేర్కొంది.
అందువల్ల, సినిమాను నిర్ణీత సమయంలో ప్రారంభించనందుకు PVR సినిమాస్‌పై రూ. 1.28 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో రూ.లక్ష వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. బాధిత వినియోగదారునికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా రూ.20,000, న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.8,000 చెల్లించాలని తీర్పు చెప్పింది కోర్టు. అదేవిధంగా భవిష్యత్తులో, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో టికెట్‌పై ఖచ్చితంగా సూచించాలంటూ ఆదేశించారు న్యాయమూర్తులు.

