Bengaluru : కర్నాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు పాటించకుండా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అక్రమంగ రన్నవుతున్న అన్ని బైక్ ట్యాక్సీలపై చర్యలు ప్రారంభమయ్యాయి.
బెంగళూరులో ఇప్పటికే పలు బైక్ ట్యాక్సీలను ట్రాఫిక్ పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సీజ్ చేశారు. పట్టణవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్న అధికారులు, అనుమతుల్లేని బైక్ ట్యాక్సీలను గుర్తించి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు బైక్ ట్యాక్సీ సేవల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన నియంత్రణలు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రజల రవాణా కోసం ఉన్న సరైన విధానాలను అనుసరించకుండా, ప్రయాణికుల భద్రతను సైతం క్షీణతకు గురిచేస్తూ నడుస్తున్న బైక్ ట్యాక్సీలపై ఇప్పటినుంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రజలు కూడా అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీల సేవలను ఉపయోగించరాదని, అది తమ సొంత భద్రతకే హానికరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నిర్ణయం నేపథ్యంలో నగరంలో ఇప్పటికే కొన్ని బైక్ ట్యాక్సీ యాప్‌లు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. రవాణా రంగంలో ఆన్‌లైన్ సేవల భద్రతా ప్రమాణాలపై ఇది చర్చను తెరపైకి తీసుకువచ్చింది.