Bengal Gangrape Case: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించిన విచారణలో బాధితురాలు తనకు ఎదురైన భయంకర అనుభవాలను వెల్లడించింది. నిందితుల రాక్షసత్వానికి సంబంధించిన వివరాలు విని అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు.
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల ఈ మెడిసిన్ విద్యార్థిని, గత శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న కాళీ బారి శ్మశాన వాటిక పక్కన ఉన్న అడవిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, “వారు తమ వాహనం దిగి మా వైపు రావడాన్ని గమనించగానే, మేము అడవి వైపు పరుగెత్తడం ప్రారంభించాము. అప్పుడు వారిలో ముగ్గురు వ్యక్తులు నా వెంట పరుగెత్తుకుంటూ వచ్చి, నన్ను పట్టుకుని, అడవిలోకి లాక్కెళ్లారు” అని తెలిపింది. నిందితులు ఆమె ఫోన్‌ను లాక్కుని, స్నేహితుడికి ఫోన్ చేయమని బలవంతం చేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాధితురాలు గట్టిగా అరవడానికి ప్రయత్నించగా, నిందితులు మరింత దారుణంగా బెదిరించారు.
Also Read: Kalvakuntla Kavitha: కవిత సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా యాత్రకు సిద్ధం
“నువ్వు అరిస్తే, మరింత మంది మగవాళ్లకు ఫోన్ చేస్తాం. వారు కూడా వచ్చి అత్యాచారం చేస్తారు” అంటూ బెదిరించినట్లు బాధితురాలు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ మాటలతో నిందితుల రాక్షసత్వం, క్రూరత్వం ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక కాలేజ్ మాజీ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నట్లు సమాచారం. కోర్టు నిందితులకు 10 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు, ఈ ఘటనపై ఒడిశా హక్కుల కమిషన్ స్పందించి, బాధితురాలిని పరామర్శించింది. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను కూడా సిద్ధం చేస్తోంది.
అయితే, ఈ సంఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలోనే జరిగిందని పోలీసుల నివేదిక చెబుతున్నప్పటికీ, అర్ధరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని రేపాయి. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.