Bellary SP: కర్ణాటకలోని బళ్లారి ఇప్పుడు రాజకీయ సెగలతోనే కాకుండా, ఒక ఐపీఎస్ అధికారి తీసుకున్న తీవ్ర నిర్ణయంతో ఉలిక్కిపడింది. ఫ్లెక్సీల వివాదం కాల్పులకు దారితీసిన ఘటనలో సస్పెన్షన్‌కు గురైన బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్, ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తుమకూరులోని ఒక ఫామ్‌హౌస్‌లో ఆయన నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గంటల వ్యవధిలోనే సస్పెన్షన్.. ఏమైందంటే?
ఈ వివాదంలో అత్యంత నాటకీయమైన అంశం ఎస్పీ నిజ్జూర్ బాధ్యతలు స్వీకరించిన సమయం. గురువారమే ఆయన బళ్లారి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం గంటల వ్యవధిలోనే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీల యుద్ధం మొదలైంది. ఇది చినికి చినికి గాలివానగా మారి, పరస్పరం కాల్పులు జరుపుకునే వరకు వెళ్లింది. ఈ హింసాకాండలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమయ్యారనే కారణంతో ప్రభుత్వం వెంటనే నిజ్జూర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Bhagyashri Borse: అఖిల్ లెనిన్.. ‘భారతి’గా భాగ్యశ్రీ బోర్సే
రాజకీయ వైరం.. పోలీసుల బలిపశువులా?
బళ్లారి రణరంగంగా మారడానికి ప్రధాన కారణం రాజకీయ ఆధిపత్య పోరు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఈ పరిణామాలపై ఇరు వర్గాలపైనా కేసులు నమోదయ్యాయి.
-
ఎమ్మెల్యే భరత్ రెడ్డి: భరత్‌తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
-
గాలి జనార్దన్ రెడ్డి: గాలితో పాటు 11 మంది బీజేపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.
అయితే, జిల్లాలో అడుగుపెట్టిన రోజే జరిగిన ఈ దారుణానికి కొత్తగా వచ్చిన ఎస్పీని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేయడంపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిస్థితు అర్థం చేసుకునే లోపే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ఆయన్ను మానసిక ఒత్తిడికి గురిచేసిందని, అందుకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సహచర అధికారులు భావిస్తున్నారు.
బళ్లారిలో 144 సెక్షన్.. హై అలర్ట్
కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వం బళ్లారిలో 144 సెక్షన్ విధించింది. వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ వంటి భారీ కార్యక్రమాలను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఒకవైపు రాజకీయ నేతల మధ్య యుద్ధం, మరోవైపు విధి నిర్వహణలో ఉన్న అధికారి ఆత్మహత్యాయత్నం.. ఈ రెండు అంశాలు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.
ప్రస్తుతం పవన్ నిజ్జూర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే ఒక అధికారి సస్పెండ్ కావడం, ఆ వెంటనే ప్రాణాలు తీసుకోవాలని అనుకోవడం వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది.
