Crime News: కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా ముదలగి తాలూకా కమలాదిన్నీ గ్రామంలో చోటుచేసుకున్న ఘోర హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పెళ్లైన నాలుగు నెలలకే భర్త తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో మంచం కింద దాచిపెట్టి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మృతురాలిని సాక్షి ఆకాష్ కుంబర్ (20)గా గుర్తించారు. భర్త ఆకాష్ కుంబర్ అదనపు కట్నం కోసం భార్యను వేధించాడని, ఆ వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అదనపు కట్నం వివాదమే కారణమా?
పోలీసుల సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం సాక్షి–ఆకాష్‌ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజులకే ఆకాష్ తన భార్యను “ఇంకా కట్నం తీసుకురా” అంటూ వేధింపులకు గురి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే సాక్షి ఆ డిమాండ్‌ను తిరస్కరించడంతో, ఆగ్రహంతో ఆకాష్ ఆమెను మూడు రోజుల క్రితమే హత్య చేసి మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టాడని అనుమానం వ్యక్తమవుతోంది.
తల్లి వచ్చిన తర్వాతే బయటపడ్డ నిజం
నిందితుడు ఆకాష్ తల్లి పని నిమిత్తం ముంబై వెళ్లి, బుధవారం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చింది. ఆమె వెతికిచూసి మంచం కింద చూసేసరికి సాక్షి మృతదేహం కనిపించింది. తక్షణమే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. ముదలగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Narsipatnam: జగన్ పర్యటనలో ఫ్లెక్సీల రచ్చ .. డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఫ్లెక్సీలు
ఫోన్ స్విచ్ ఆఫ్ – భర్తకు మిస్సింగ్ ట్రేస్
హత్య జరిగినప్పటి నుండి ఆకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు వెల్లడించారు. అతను ముంబై వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభించాయి.
కుటుంబాల మధ్య ఆరోపణల యుద్ధం
సాక్షి కుటుంబం – “ఆకాష్ అదనపు కట్నం కోసం నా కుమార్తెను నిత్యం వేధించేవాడు, చివరికి ఆమెను చంపేశాడు” అని తీవ్రంగా ఆరోపిస్తోంది.
అయితే ఆకాష్ తల్లి మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. “నా కొడుకు ఎప్పుడూ కట్నం కోసం ఒత్తిడి చేయలేదు, సాక్షి కుటుంబం కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోంది” అని ఆమె చెప్పింది.
దర్యాప్తు ముమ్మరం
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య జరిగినది 3 రోజుల క్రితమే అని ఫోరెన్సిక్ బృందం అంచనా వేసింది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.