BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధ్రువీకరించారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు పెరగడం, అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆటగాడికి ఐపీఎల్‌లో అవకాశం ఇవ్వడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్, ఫ్రాంచైజీపై వస్తున్న విమర్శల దృష్ట్యా, భద్రత, నైతిక కారణాలతో ముస్తఫిజుర్‌ను పక్కన పెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.
Also Read: Sana Javed: నా భర్తను ఎవరికీ ఇవ్వలేను”: నటి సనా జావేద్ కామెంట్‌పై నెటిజన్ల ట్రోలింగ్
ముస్తఫిజుర్ స్థానంలో మరొక విదేశీ ఆటగాడిని ఎంచుకునేందుకు కేకేఆర్ జట్టుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. 2016 నుండి ఐపీఎల్‌లో కొనసాగుతున్న ముస్తఫిజుర్, ఇప్పటివరకు 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల వల్ల ఈ సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా సందిగ్ధంలో పడ్డాయి.
