Rohit- Kohli: భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బీసీసీఐ (BCCI) విధించిన కొత్త షరతు అని తెలుస్తోంది. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్‌లో తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో కూడా ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్, ఫిట్‌నెస్‌ను కొనసాగించాలనే ఉద్దేశ్యం అని తెలుస్తోంది. 2027 ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40కి, విరాట్ కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. టీమిండియా మేనేజ్‌మెంట్ 2027 ప్రపంచకప్ కోసం ఒక కొత్త జట్టును సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీలు ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిది కావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయమై బీసీసీఐ కానీ, రోహిత్, కోహ్లీలు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

