BC Bandh: స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్ అక్టోబర్ 18న జరగనున్నది. ఈ మేరకు అన్ని బీసీ సంఘాలు బీసీ సంఘాల జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ మేరకు బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతో బంద్ కార్యక్రమానికి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
BC Bandh: ఈ మేరకు బంద్ విజయవంతం కోరుతూ బీసీ సంఘాల జేఏసీ నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితర బీసీ నేతలు అన్ని పార్టీలను సంప్రదించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా కుల, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. దీంతో సంపూర్ణ బంద్ దిశగా ఆయా పార్టీలు, సంఘాలు పయనిస్తున్నాయి. అదే విధంగా మావోయిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్, ఎల్‌హెచ్‌పీఎస్ సహా పలు విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి.
BC Bandh: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన జీవో9పై హైకోర్టు స్టే విధించగా, సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో బీసీలు రగిలిపోతున్నారు. చట్టబద్ధంగా అమలు కావాలంటే 9వ షెడ్యూల్ లో చేర్చడం ఒక్కటే మార్గమని, అందుకు ఐక్య పోరాటంతో సాధించాలని బీసీ నేతలు పిలుపునిచ్చారు.
BC Bandh: ఈ మేరకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసి వేయాలని బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్సులను ముందు రోజు నుంచి బంద్ పెట్టాలని ఆర్టీసీ ఎండీని బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హితవు పలికారు.
ఆ రెండు పార్టీలూ మద్దతు
BC Bandh: ఇదిలా ఉండగా, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 18న బీసీ బంద్‌కు మద్దతుగా నిలువడంపై చర్చనీయాంశంగా మారింది. హామీ ఇచ్చి చట్టబద్ధ రిజర్వేషన్ల అమలుకు కాకుండా జీవోలతో కాలయాపన చేస్తూ వచ్చిందని కాంగ్రెస్ సర్కార్‌పై బీసీలు గుర్రుగా ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ పంపిన బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, గవర్నర్‌కు పంపిన మరో బిల్లు కూడా పెండింగ్‌లో నే ఉన్నది. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరే కారణమని, 9వ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది బీజేపీ ప్రభుత్వమేనని, అది చేయని ఆ ప్రభుత్వాన్ని బీసీలు దోషిగా నిలబెడుతున్నారు. ఈ దశలో ఆ రెండు పార్టీల మద్దతుపై విస్మయం వ్యక్తమవుతున్నది.