Bayya Sunny Yadav: పాకిస్థాన్ పర్యటన నేపధ్యంలో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఇటీవలే బైక్‌పై పాకిస్థాన్ వెళ్లిన అంశంపై విచారణ చేపట్టారు.
భద్రతాపరమైన కారణాల వల్ల సన్నీ యాదవ్ పర్యటనపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎవరితోనైనా సంబంధాలున్నాయా? గూఢచర్యానికి సంబంధించిన ఏవైనా కార్యకలాపాలు చేశాడా? అనే కోణాల్లో ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది.
దాడులు – జ్యోతి మల్హోత్రా సహా పలువురి అరెస్ట్
ఇక ఇదే సమయంలో మరో సంచలనం – పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాక్ అధికారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జ్యోతి మల్హోత్రా పాక్‌లో తీసిన అనేక వీడియోలు యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్థాన్ పర్యటించిన విషయం బయటపడింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు హతమయ్యారు. ఆమె ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హర్యానా జైల్లో ఉన్నారు. ఎన్ఐఏ ఆమెను తొమ్మిది రోజుల పాటు విచారించింది.
ఆపరేషన్ సిందూర్ – భారత్ కౌంటర్ దాడి
ఏప్రిల్ 22న ఉగ్రదాడికి ప్రతిగా, మే 7న భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారీ కౌంటర్ దాడి నిర్వహించింది. ఈ దాడిలో 100మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
అంతేకాకుండా, పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
సింధు జలాల సరఫరా నిలిపివేత
పాక్ వీసాల రద్దు
అటారీ సరిహద్దు మూసివేత
ఈ నేపథ్యంలో యూట్యూబర్లపై అనుమానాలు మరింత తీవ్రంగా మారాయి. సోషల్ మీడియా ద్వారా దేశద్రోహక చర్యలకు చోటివ్వొచ్చన్న ఆందోళనలు భద్రతా సంస్థల్లో వ్యక్తమవుతున్నాయి.

