Banking News: దేశంలో ఏటీఎం (ATM)ల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆ సంఖ్య వేలల్లో ఉండటం గమనార్హం. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అంచనా వేసి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ అనే నివేదికలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రజలంతా మొగ్గు చూపడంతోనే వివిధ బ్యాంకుల ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నదన్న వాస్తవం వెల్లడైంది.
Banking News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2024 మార్చి నుంచి 2025 మార్చి 31 నాటికి సేకరించిన వివరాల ఆధారంగా వేలాది సంఖ్యలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోయింది. 2024లో 2,53,417గా ఉన్న ఏటీఎంల సంఖ్య, 2025 నాటికి 2,51,057కు పడిపోయిందని తేలింది. ముఖ్యంగా ప్రైవేటు రంగ బ్యాంకులు తమ ఏటీఎంలను భారీగా కుదించుకుంటున్నాయని వెల్లడైంది. నిరుడు 79,884గా ఉన్న ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలు.. ఈ ఏడాది నాటికి 77,117కు తగ్గాయి. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ సంఖ్య 1,34,694 నుంచి 1,33,544కు స్పల్ప తగ్గుదల నమోదైంది.
Banking News: మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఏటీఎంల సంఖ్య ఏటేటా తగ్గుముఖం పడుతున్నప్పటికీ బ్యాంకుల బ్రాంచిల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుండటం విశేషం. కొత్త బ్రాంచుల ఏర్పాటులో ప్రైవేటురంగం బ్యాంకుల కంటే ప్రభుత్వరంగ బ్యాంకులే దూకుడుగా ఉన్నాయని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికల్లో వెల్లడించింది. ఈ మేరకు 2025 మార్చి నాటికి దేశంలో బ్యాంకు శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి మొత్తంగా 1.64 లక్షలకు చేరింది.
