khaleda zia: బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలిగిన ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వివిధ ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె, మంగళవారం (డిసెంబర్ 30, 2025) తెల్లవారుజామున 6 గంటలకు ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన ఖలీదా జియా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ వచ్చింది. ఆమెకు లివర్ సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు తీవ్రమవ్వడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలకు చెందిన నిపుణుల బృందం ఆమెను రక్షించేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణించే సమయంలో కుమారుడు తారీఖ్ రెహమాన్, ఇతర కుటుంబ సభ్యులు చెంతనే ఉన్నారు.
Also Read: MLA: జనవరి 6 లేదా 9న డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు
ఖలీదా జియా ప్రస్థానం అత్యంత సాహసోపేతమైంది. 1945లో జన్మించిన ఆమె, 1960లో జియావుర్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. 1981లో తన భర్త హత్య తర్వాత అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. 1991-96 మరియు 2001-06 కాలంలో మొత్తం పదేళ్ల పాటు ఆమె దేశాన్ని పాలించారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్య కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలు ఆ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి.
ఆమె మృతితో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, 2026లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె మరణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బీఎన్‌పీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆమె కలలుగన్నారు. ఆమె భౌతికకాయానికి బుధవారం (డిసెంబర్ 31) ఢాకాలోని మాణిక్ మియా అవెన్యూలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
