Bangladesh: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా వీరు బంగ్లాదేశ్‌లోని బాగేర్‌హట్ జైలులో ఉండగా, ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు జైలు అధికారులు వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో భారత హైకమిషన్ అధికారులు, హోం వ్యవహారాలు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు పాల్గొన్నారు. విడుదలైన మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు భారీ భద్రతతో మోంగ్లా సీపోర్ట్‌కు తరలించింది.
గురువారం రోజున బంగ్లాదేశ్–భారత్ సముద్ర సరిహద్దు మధ్యలో వీరిని ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించే అవకాశం ఉంది.
ఈ మత్స్యకారులు 2025 అక్టోబర్‌లో అనుకోకుండా బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి అధికారులు వారిని అరెస్టు చేశారు. రెండు దశల్లో అరెస్టులు జరిగాయి. మొదటిసారి 14 మందిని, రెండోసారి 9 మందిని బంగ్లాదేశ్ నావికాదళం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి వీరు బాగేర్‌హట్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
