Bangalore: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట: హైకోర్టు సుమోటో కేసు నమోదు

Bangalore: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయం నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన వేడుకలు విషాదంగా ముగిశాయి. వేలాది మంది అభిమానులు ఒకేసారి స్టేడియానికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ దుర్ఘటనను సుమోటోగా పరిగణించిన కర్ణాటక హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గురువారం జరిగిన విచారణలో, అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను ధర్మాసనం పరిశీలించింది. “స్టేటస్ రిపోర్టును రికార్డులోకి తీసుకున్నాం. ఈ సుమోటో కేసును రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం,” అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.

తొక్కిసలాట అనంతరం సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించనున్నారు. మేజిస్టీరియల్ దర్యాప్తును ఆదేశించారు. ఆయన పేర్కొన్నట్లుగా, ప్రజలు అంత భారీ సంఖ్యలో వచ్చేదని ప్రభుత్వం ఊహించలేకపోయిందని వెల్లడించారు.

ఇకపోతే ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా బీజేపీ, జేడీఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. బాధ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ “హృదయ విదారక ఘటన”గా అభివర్ణించారు. ప్రస్తుతం హైకోర్టు జోక్యం చేసుకోవడంతో, ప్రభుత్వ చర్యలపై ప్రజలు, రాజకీయవర్గాలు తహతహలాడుతున్నాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *