Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అతి పెద్ద ఉపశమనం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థులు పరీక్ష ఫీజు కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫీజు మొత్తాన్ని తన స్వంత వేతనం నుండి చెల్లించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారికంగా లేఖలు పంపారు.
12,292 మంది విద్యార్థులకు రూ. 15 లక్షలకుపైగా సాయం
అధికార వర్గాల సమాచారం ప్రకారం, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 12,292 మంది విద్యార్థిని, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, హన్మకొండ జిల్లాల విద్యార్థులు ఉన్నారు. వీరందరి పరీక్ష ఫీజు చెల్లించడానికి రూ. 15 లక్షలకుపైగా ఖర్చు అవుతుందని అంచనా.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక శాతం కూలీ పనులు చేసుకునేవారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు. ఇలాంటి కుటుంబాలకు పరీక్ష ఫీజు చెల్లించడం కూడా భారమే అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బండి సంజయ్, విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించాలని ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
Also Read: New Districts in AP: కొత్త జిల్లాలతో పాటూ కొత్త నియోజకవర్గాలు కూడా..?
“మోదీ గిఫ్ట్” కింద మరిన్ని సదుపాయాలు
బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేద విద్యార్థులకు “మోదీ గిఫ్ట్” పేరుతో నిరంతరం సహాయం అందిస్తున్నారు. విద్యారంగంలో ఆయన చేపట్టిన ఇతర కార్యక్రమాలు గతంలోనే ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతి శిశు మందిరాల్లో చదువుతున్న దాదాపు 20 వేల మందికి పైగా విద్యార్థులకు బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లను అందించనున్నట్లు ప్రకటించారు.
‘మోదీ కిట్స్’ ప్రణాళిక: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే, విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ వంటి సామాగ్రిని కలిపి ‘మోదీ కిట్స్’ పేరుతో ఉచితంగా పంపిణీ చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు.

