Bandi sanjay: తెలంగాణ బీజేపీలో మునుపెన్నడూ లేనంతగా విభేదాలు రచ్చకెక్కాయి. ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గంలో అక్కడి ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నడుమ విభేదాలు రచ్చకెక్కాయి. చినికి చినికి గాలివానలా బహిరంగ విమర్శలకు దారితీశాయి. ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి. ఆయన వ్యాఖ్యలపై బండి సంజయ్ కూడా ప్రతిస్పందించారు.
Bandi sanjay: తొలుత కరీంనగర్ నియోజకవర్గ నేతలతో జరిగిన ఓ సమావేశంలో బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే తక్కువ మార్కులొచ్చాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కొందరి వల్ల తనకు ఓట్లు తక్కువగా వచ్చాయని, అలాంటి వారికి వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇద్దామా? అంటూ పేర్కొన్నారు.
Bandi sanjay: బండి సంజయ్ వ్యాఖ్యల ఫలితంగా హుజూరాబాద్‌లోని ఈటల రాజేందర్ వర్గం తీవ్రస్థాయిలో రగిలిపోతున్నది. ఈటల రాజేందర్‌ను, ఆయన వర్గాన్న బండి సంజయ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారని భావించింది. దీంతో ఏకంగా ఈటల వర్గానికి చెందిన బీజేపీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీనామా చేశారు.
Bandi sanjay: ఆ తర్వాత తాడోపేడో తేల్చుకునేందుకు శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి హుజూరాబాద్‌లోని ఆయన వర్గం ముఖ్య కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు 2,000 మందికి పైగా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏదో ఒకటి తేల్చుకుందామని వారంతా ఈటలకు చెప్పారు. ఇదే సమయంలో వారిని ఉద్దేశించి మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు.
Bandi sanjay: తన వర్గానికి జరిగిన అన్యాయంపై, సోషల్ మీడియాలో ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తామని, వాటిపై చర్యలు తీసుకుంటే మంచిది.. లేదంటే ఎవరికి నష్టం జరుగుతుందో తేల్చుకోవాలంటూ ఏకంగా ఈటల సవాల్ విసిరారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈటల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Bandi sanjay: ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిస్పందించారు. ఈటల వ్యాఖ్యలపై స్పందించేందుకు బండి సంజయ్ నిరాకరించారు. అయితే ఒకటి మాత్రం చెప్పారు. ఈటల వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని సూచించారు. ఈటల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పినట్టు సమాచారం. ఈటల తీవ్రస్థాయిలో చేసిన వ్యాఖ్యలతో బండి వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఆయనకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా వారితో బండి పైవిధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
Bandi sanjay: దయచేసి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దు.. మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టొద్దు.. పార్టీ పరువును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. పార్టీ అంతర్గత వ్యవహారాలను జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఏ ఒక్కరూ బహిరంగంగా మాట్లాడటానికి వీల్లేదు.. అని బండి సంజయ్ హితవు పలికినట్టు సమాచారం.