Bandi Sanjay: కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన ‘‘ఓట్ల చోరీ’’ ఆరోపణలపై స్పందించిన ఆయన, అవి అర్ధరహితమని స్పష్టం చేశారు.
దొంగ ఓట్ల ఆరోపణలపై స్పందన
‘‘దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణలు ప్రజలను అవమానించడం వంటివే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తుందనే స్థానిక ఎన్నికలు జరుపుతోంది’’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
30 ఏళ్ల రాజకీయ అనుభవం – సీట్ల చోరీపై సవాల్
తాను 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నానని గుర్తు చేసిన ఆయన, ‘‘వార్డు మెంబర్ కానివాళ్లు కూడా విమర్శలు చేయడం సరికాదు. పీసీసీ అధ్యక్షుడు ఓట్ల చోరీ గురించి కాకుండా సీట్ల చోరీ గురించి మాట్లాడాలి’’ అని వ్యాఖ్యానించారు.
గ్యారంటీలపై ప్రజల అసహనం
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రజలు తిరుగుబాటు మూడ్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ‘‘మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా’’ అని సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: Vantara: జంతు చట్టాల ఉల్లంఘన.. ‘సిట్’ విచారణకు అంబానీ వంతారా
వర్గ, మత రాజకీయాలపై దాడి
కరీంనగర్‌లో ఒక్కో మైనార్టీ ఇంటికి వందలాది ఓట్లు ఉండటం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల స్థానంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని కాంగ్రెస్‌ను నిలదీశారు. ‘‘రొహింగ్యాల విషయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. దేశం ముఖ్యమా? లేక ఓటు బ్యాంకు ముఖ్యమా?’’ అని ప్రశ్నించారు.
హిందూ ధర్మం కోసం బీజేపీ పోరాటం
‘‘ఎన్నికలు ఉన్నా లేకున్నా హిందూ ధర్మం కోసం బీజేపీ నిలబడుతుంది’’ అని స్పష్టం చేశారు. భైంసాలో పేద హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ‘‘మాదీ దేవుళ్ల పార్టీ, మీది బిచ్చపు బతుకు’’ అంటూ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. ఆలయాల్లో సౌండ్ పెట్టొద్దని చెప్పే హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన హెచ్చరించారు.
కరీంనగర్ విజయంపై వ్యాఖ్య
తాను కరీంనగర్‌లో గెలవడానికి హిందూ ఓటు బ్యాంకే ప్రధాన కారణమని స్పష్టం చేసిన బండి సంజయ్, ‘‘టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది కాంగ్రెస్. కానీ మా పార్టీ ఎప్పుడూ దేవుళ్ల కోసం, దేశం కోసం నిలబడుతుంది’’ అన్నారు.