Bandi Sanjay: మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది శాంతిభద్రతల సమస్య. తుపాకులతో ప్రజలను, పోలీసులను చంపుతున్న మావోయిస్టులతో చర్చలు అనుమతించలేం అని అయన స్పష్టం చేశారు.
ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తపల్లిలో జరిగిన హనుమంతుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి లొంగాలి. వారు మారాలి. వారితో చర్చలు చేసే ప్రసక్తే లేదు, అని తెలిపారు.
రేవంత్ వ్యాఖ్యలు అసంబద్ధం
సీఎం రేవంత్ “ఆపరేషన్ కాగర్” పై వ్యాఖ్యలు తగవని వ్యాఖ్యానించిన బండి సంజయ్, మావోయిస్టులు అమాయకులను చంపుతున్నప్పుడు, దానిని సామాజిక కోణంలో చూడడం తగదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అప్పట్లో మావోయిస్టులను నిషేధించింది. ఇప్పుడు అదే పార్టీ వారు నిబంధనల్ని విస్మరించి దుస్థితికి దారితీస్తున్నారు అని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో మంత్రి పొన్నం భేటీ
కేసీఆర్ – రేవంత్ పై ఆరోపణలు
కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రంగంలోకి వచ్చి, మావోయిస్టుల పక్షంగా మాట్లాడుతున్నారు. రేవంత్ కూడా అదే బాటలో ఉన్నారు. ఇద్దరూ ఎవరెవరు మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడతారో పోటీ పడుతున్నారు, అని ఆరోపించారు.
రోహింగ్యాలు, విదేశీయులపై ఆందోళన
తెలంగాణలో పాకిస్తానీ జాతీయులు, రోహింగ్యా శరణార్థులు పాస్‌పోర్ట్ లేకుండా నివసిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇది తీవ్రమైన శాంతిభద్రతల సమస్య. దీనిని మత, రాజకీయ కోణాల్లో కాకుండా జాతీయ భద్రత కోణంలో చూడాలి. లేదంటే హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.