Bandi Sanjay: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుతో కలిసి ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్, ప్రతిపక్షాల ఆరోపణలపై పదునైన వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల చోరీ ఆరోపణలపై సమాధానం
“ఓట్లు చోరీ జరిగి ఉంటే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవి ఎలా? మేము నిజంగా మేనేజ్ చేస్తే బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి?” అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తూ, “అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది” అని కౌంటర్ ఇచ్చారు.
‘గో బ్యాక్’ ప్రచారంపై విమర్శలు
తెలంగాణలో జరుగుతున్న “మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్” నినాదాలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఇవి హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలేనని, కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. “మార్వాడీలు తెలంగాణ జీడీపీ పెరగడానికి కష్టపడుతున్నారు, ఇక్కడ రాజ్యాధికారం కోసం రావడం లేదు” అని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మార్వాడీలు ఉన్నా అక్కడ ‘గో బ్యాక్’ అనడం లేదని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Cloud Particle Scam: ఈడీ రైడ్స్‌లో రూ.73.72 కోట్ల ఆస్తులు సీజ్..
పాతబస్తీ, రోహింగ్యాలపై ప్రశ్నలు
పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మటన్, డ్రైక్లీన్ వంటి వృత్తులు ఒకే వర్గం ఆధీనంలో ఉంటే నోరు మెదపని వారిని నిలదీశారు. “రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం” అని హెచ్చరించారు.
తిరంగా ర్యాలీలపై వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు ఘనంగా జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం జెండాలు ఎగురవేయనీయడం మూర్ఖత్వమని బండి సంజయ్ మండిపడ్డారు. “ప్రధాని మోదీ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ జెండా ఎగరేసే కార్యక్రమం మొదలైంది. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ దేశానికి గర్వకారణం” అని ప్రశంసించారు.
ప్రతిపక్షాలకు సూటి హెచ్చరిక
“ఎన్నికల సంఘాన్ని మేము మేనేజ్ చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితమవుతాం? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంట్లో 300 ఓట్లు ఉన్నాయంటూ మాకు సమాచారం ఉంది” అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 60 ఏళ్లు దోచుకుందని ఆరోపిస్తూ, “బీహార్‌లో మీ పార్టీని ప్రజలు నమ్మరు… గెలిచేది భాజపానే” అని స్పష్టం చేశారు.