Bandi sanjay: తెలంగాణలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు. మీడియాలో ప్రచారం తప్ప కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఆమెరికాలోని ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఎన్నారైలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలందిస్తామన్నారు బండి సంజయ్. హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారుఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటోందన్నారు. దక్షిణాదికి అన్యాయం పేరుతో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు బండి సంజయ్.
ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలనడం సిగ్గు చేటన్నారు. ఇక బీఆర్ఎస్ పనైపోయింది..ఆ పార్టీకి క్యాడర్ లేదు…లీడర్లంతా గోడమీది పిల్లులయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ అని బండి సంజయ్ అన్నారు.