Bandi sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అరెస్టును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు రాంచందర్ రావును అదుపులోకి తీసుకోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ మార్గంలోనే నడుస్తోంది. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది,” అని బండి సంజయ్ మండిపడ్డారు. రాంచందర్ రావు సహా అరెస్టైన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
“ప్రభుత్వం చేయాల్సింది అరెస్టులు కాదు, ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. నిరంకుశ విధానాలు కొనసాగితే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు,” అని ఈటల హెచ్చరించారు.
సచివాలయ ముట్టడికి ప్రయత్నం
జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నేడు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ వద్ద రాంచందర్ రావును అదుపులోకి తీసుకున్నారు.
