Bandi sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. లేఖలో, టీటీడీ విదేశాల్లోని ధూప, దీప, నైవేద్యాలు పంపించడం మంచి పరిణామం అని అన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో కీలకపాత్ర పోషించడం టీటీడీకి సంబంధించిన గొప్ప విషయమని ప్రశంసించారు.
బండి సంజయ్ లేఖలో, “టీటీడీ దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేస్తూ, హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎంతో కృషి చేస్తోందని” పేర్కొన్నారు. ప్రపంచంలో వివిధ దేశాలలో హిందూ ఆచారాలను, సాంప్రదాయాలను అందించడంలో టీటీడీ చేస్తున్న పాత్రను కొనియాడారు.
2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, మే 31న 10 ఎకరాల భూమిలో భూమిపూజ కూడా జరిగినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత నుంచి ఆలయ నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం లేదని నిరాశ వ్యక్తం చేశారు.
బండి సంజయ్ లేఖలో, కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో, ఆయన టీటీడీకి తక్షణమే ఆలయ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.