Bandi sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో వరదల కారణంగా జరిగిన భారీ నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించనున్నట్లు వెల్లడించారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాబ్ ప్రజలు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని, మోదీ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చేందుకే తాను పంజాబ్ పర్యటనకు వచ్చినట్లు ఆయన వివరించారు.
శనివారం రెండు రోజుల పర్యటనలో భాగంగా బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదల తీవ్రతతో సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కూడా కనబడకపోయిందని పేర్కొన్నారు. అయితే, బీఎస్ఎఫ్ సిబ్బంది మాత్రం వానలు, వరదలను లెక్క చేయకుండా నిరంతరం గస్తీ కాస్తూ, ప్రజలను రక్షిస్తూ అద్భుత సేవలు అందించారని కొనియాడారు. వారి ధైర్యం, సాహసం, త్యాగాలను ప్రశంసిస్తూ వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
గురుచుర్, సమురయ్, ఘనియక్ బేట్, రన్ సేక్ తల్లాన్ గ్రామాల ప్రజలతో మాట్లాడిన ఆయన, వారికి నెలరోజులకు సరిపడే బియ్యం, పప్పు, మసాలా దినుసులతో కూడిన “మోదీ కిట్లు” అందజేశారు.
పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,097 గ్రామాలు వరద ముంపుకు గురవగా, 3,88,092 మంది ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారని, 56 మంది ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వం వారితోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.