BALMURI VENKAT: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు ఖండించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కౌశిక్‌రెడ్డి డబ్బుల కోసం దందాల్లో పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం గర్వకారణం కాదని, నేతలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు దొంగలకు ఆశ్రయం ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేసి కాదు, క్రషర్ యజమానుల నుంచి బ్లాక్‌మెయిల్ ద్వారా డబ్బులు వసూలు చేసినందుకే ఆయన అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కూడా కౌశిక్‌రెడ్డికే దక్కిందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను విదేశాలకు పంపినట్లే, కౌశిక్‌రెడ్డిని దేశం దాటించే ప్రయత్నం కూడా జరిగినట్లు ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు ఇప్పుడు తమ ఎంపికపై పశ్చాత్తాపానికి గురవుతున్నారని అన్నారు. బనకచర్ల అంశంపై కూడా కేటీఆర్, హరీశ్ రావు నైతికంగా స్పందించాలని, నిజం ఉంటే ప్రమాణం చేయాలని బల్మూరి సవాల్ విసిరారు.