Balapur Ganesh History: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఈ రెండు ఘట్టాలు నగర వినాయకోత్సవాలకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. బాలాపూర్ లడ్డూ వేలం పాట చరిత్రకు మూడున్నర దశాబ్దాలు దాటినా, ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూ భక్తుల హృదయాలను గెలుచుకుంటోంది.
1994లో మొదలైన సంప్రదాయం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని బాలాపూర్ గ్రామంలో గణేశ్ ఉత్సవాలు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే, లడ్డూ వేలంపాట సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ఆ ఏడాది తొలిసారి లడ్డూను గ్రామానికి చెందిన రైతు కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ.450కి సొంతం చేసుకుంది. లడ్డూను గ్రామస్తులకు ప్రసాదంగా పంచడంతో పాటు పొలంలో చల్లగా, ఆ ఏడాది మంచి దిగుబడులు రావడంతో లడ్డూ మహిమపై భక్తుల్లో నమ్మకం పెరిగింది.
ఇది కూడా చదవండి: Ganapati Ladoo Auction: ఆల్ టైం రికార్డ్.. వేలంలో రూ.2.31కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే..?
రికార్డుల పయనం
1994 నుంచి 2001 వరకు వేలంలో ధరలు వేలు దాటితే, 2002లో మొదటిసారి లక్షల్లోకి చేరింది. అప్పటినుంచి ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డు సృష్టిస్తోంది. గతేడాది (2024) లడ్డూ రూ.30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. అంతకు ముందు ఏడాది రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు.
కఠినమైన నిబంధనలు
లడ్డూ వేలంపాటపై భక్తుల పోటీ పెరగడంతో నిర్వాహకులు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. వేలంలో పాల్గొనాలంటే గతేడాది లడ్డూ ధరావత్తును డిపాజిట్‌గా చెల్లించాలి. అంటే, ఈసారి వేలంలో అడుగుపెట్టాలంటే రూ.30 లక్షల డిపాజిట్ తప్పనిసరి. ముందు ఈ నిబంధన బాహ్య వ్యక్తులకు మాత్రమే ఉండేది. కానీ గతేడాది నుంచి స్థానికులకు కూడా వర్తింపజేశారు.
శోభాయాత్ర ఆరంభం
బాలాపూర్ బొడ్రాయి దగ్గర లడ్డూ వేలంపాట అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడినుంచి ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నగర నిమజ్జన వేడుకలకు నాంది పలుకుతుంది.