Balapur Ganesh: వినాయక నవరాత్రులు ముగియగా, గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరమంతా సందడి మయమవుతోంది. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహా నిమజ్జన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర.
బాలాపూర్ వీధుల నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర నగరంలోని 18 ప్రధాన జంక్షన్ల మీదుగా ఊరేగుతూ, ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ యాత్రకు ప్రత్యేకత ఏమిటంటే, ఇదే మొదటగా ప్రారంభమై, బాలాపూర్ గణపయ్య నిమజ్జనంతోనే మొత్తం శోభాయాత్ర ముగిసినట్లుగా భావిస్తారు. గతంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం రాత్రివేళల్లో జరిగేది. అయితే ఈసారి మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు వేశారు.
ఉదయం ప్రత్యేక పూజలతో గణనాథుడిని ప్రత్యేక వాహనంలో ఎక్కించి ఊరేగింపును ప్రారంభిస్తారు. అనంతరం గ్రామ బొడ్రాయ్ వద్ద బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూ వేలం పాట జరుగుతుంది. 29 ఏళ్ల క్రితం కేవలం రూ.420తో మొదలైన ఈ వేలం, గతేడాది రూ.30 లక్షలకు చేరింది. ఈసారి రికార్డు బద్దలు కొడుతుందా అనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది. వేలం పాట అనంతరం గణనాథుడు బాలాపూర్ వీధుల్లో భక్తుల మంగళహారతుల మధ్య ఊరేగింపుతో పయనమవుతాడు.
ఇది కూడా చదవండి: Ganapati Ladoo Auction: ఆల్ టైం రికార్డ్.. వేలంలో రూ.2.31కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే..?
శోభాయాత్ర మొత్తం 19 కిలోమీటర్ల మేర సాగుతుంది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, చార్మినార్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వంటి ప్రముఖ మార్గాలపై గణనాథుడి పర్యటన కన్నులపండువగా ఉంటుంది. రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్ క్రేన్ వద్ద గణనాథుడు చేరుకుని, అక్కడ ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడిలోకి చేరుతాడు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీస్, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. చార్మినార్, తెలుగుతల్లి వంతెన పరిసరాల ఊరేగింపు మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి అడుగులోనూ “జై జై గణేశా” నినాదాలతో నగరం మారుమోగనుంది.
బాలాపూర్ గణపయ్యతో ప్రారంభమై ఆయన నిమజ్జనంతోనే ముగియనున్న ఈ మహా శోభాయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో సిద్ధమవుతున్నారు.