Balakrishna: అమరావతి రాజధాని ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తుళ్లూరు సమీపంలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణం కానుంది. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ హాజరయ్యారు.
ప్రాజెక్టు వివరాలు :
రెండు దశల్లో నిర్మాణం: ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొదటి దశ: తొలి దశలో రూ. 750 కోట్ల పెట్టుబడితో 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారు. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇది క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సలో సహాయపడుతుంది.
రెండవ దశ: రెండో దశలో ఆసుపత్రి పడకల సంఖ్యను వెయ్యికి పెంచుతారు. దీనితో పాటు ప్రత్యేక విభాగాలు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఈ కొత్త క్యాంపస్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు కొనసాగింపుగా ఉంటుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు అన్ని రకాల చికిత్సలను ఒకేచోట అందించాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
భూమిపూజ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, “ఈ రోజు చాలా మంచి రోజు. వాతావరణం కూడా సహకరించింది. మంచి కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనేందుకు ఇదే నిదర్శనం,” అని అన్నారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి ప్రజలకు గొప్ప సేవలు అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.