Balakrishna: ‘అఖండ 2’ చిత్రం కేవలం ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పిన భారతీయులందరి సినిమా అని నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
‘అఖండ 2’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి బాలకృష్ణ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ,“మంచి సినిమా చేయాలన్న సంకల్పంతో మేము చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భక్తి, ధర్మాన్ని ప్రధానాంశాలుగా తీసుకుని సినిమాను రూపొందించినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తమను ప్రత్యేకంగా అభినందించారని బాలకృష్ణ వెల్లడించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ ఈ నెల 12న విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయోత్సవ సభ నిర్వహించిన చిత్ర బృందం, ప్రస్తుతం ఉత్తర భారతంలో విడుదల అనంతర ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతోంది.
