Bala Krishna:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ (Telangana Gaddar Awards) కార్యక్రమం హైదరాబాద్ ఐటెక్స్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు (NTR National Film Award)ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలయ్య స్వీకరించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ, “కళలకు చావు లేదు. దళిత కుటుంబంలో జన్మించి, తన పోరాట గీతలతో ప్రజల గుండెల్లో నిలిచిన గద్దరన్న పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఈ అవార్డు నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. గద్దర్‌కు ఇది శాశ్వత గుర్తింపుగా నిలుస్తుంది,” అన్నారు.
అలాగే “నందమూరి తారక రామారావు కళలు, విశ్వాసానికి ప్రతీక. ఆయన రూపమే ‘విశ్వనటుడు’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఎన్టీఆర్ అవార్డులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుండటం హర్షణీయం. రాష్ట్రాలు వేరు అయినా, మనమంతా తెలుగువాళ్లమే. ఈ చలనచిత్ర ఉత్సవంలో నాకు అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది,” అంటూ బాలకృష్ణ తన భావాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు కూడా గద్దరన్న సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ గద్దర్ అవార్డులు, రాష్ట్ర సాంస్కృతిక రంగానికి కొత్త దిక్సూచి అవుతాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
