Mamata Banerjee: పశ్చిమ బంగాల్ లోని వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు బంగాల్ లో తన కుమార్తె ప్రాణానికి ప్రమాదం ఉందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఆమెను ఒడిశా తరలించాలని కోరారు. అత్యాచార ఘటన రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య చోటు చేసుకుంటే అర్థరాత్రి బాధితురాలు బయటకు వచ్చినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో శుక్రవారం రాత్రి (అక్టోబర్ 10, 2025) ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల బాధితురాలు శుక్రవారం రాత్రి తన సహవిద్యార్థి (మగ స్నేహితుడు)తో కలిసి క్యాంపస్ వెలుపలికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: FireCrackers: బాణసంచా విక్రయదారులకు అలర్ట్.. పోలీస్ శాఖ హెచ్చరికలు ఇవే
కాలేజీ గేటు సమీపంలోనే దుండగులు వారిని అడ్డగించి, యువతిని బలవంతంగా క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఆమె నుంచి మొబైల్ ఫోన్, డబ్బులు కూడా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, తీవ్ర మానసిక ఆందోళనలో ఉంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనను ‘దిగ్భ్రాంతికరం’గా అభివర్ణించారు. అయితే, “విద్యార్థిని రాత్రిపూట బయటకు వెళ్లడం ఎవరి బాధ్యత? రాత్రిపూట బయటకు వెళ్లకూడదు” అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. బాధితురాలి తండ్రి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను విమర్శించారు.ఈ కేసును సుమోటోగా స్వీకరించి, రాష్ట్ర డీజీపీ నుంచి చర్యల నివేదికను కోరింది. బాధితురాలి తండ్రి తన కుమార్తెను పశ్చిమ బెంగాల్ నుండి ఒడిశాకు తీసుకువెళ్లి అక్కడ విద్యను పూర్తి చేయించాలని కోరుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది, పోలీసులు ఇతర కోణాలను కూడా పరిశీలిస్తున్నారు, ముఖ్యంగా బాధితురాలితో పాటు వెళ్లిన సహవిద్యార్థి పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.