Zakia Khanam joins BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్సీ జకియా ఖానం, తన ఎమ్మెల్సీ పదవికి, అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తన నిర్ణయాన్ని శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజుకు రాజీనామా లేఖ ద్వారా తెలియజేశారు. ఈ రాజీనామాతో, వైసీపీ నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడగా… వారి జాబితాలో జకియా ఖానం కూడా చేరారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం, వైసీపీలో కీలక మైనార్టీ నాయకురాలిగా గుర్తింపు పొందారు. 2020 జులైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఆమె, శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి పార్టీలో సమర్థవంతంగా పనిచేసిన జకియా, రాయచోటి ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టు సాధించారు. అయితే, పార్టీలో గత రెండేళ్లుగా ఆమె అసంతృప్తిగా ఉన్నారు. రాయచోటి అసెంబ్లీ సీటును ముస్లింలకు కేటాయిస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, ఆ సీటు ఆయన సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డికి దక్కింది. ఈ నేపథ్యంలో, జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ పదవిని ఇచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ, ఈ పదవులు కేవలం పేరుకు మాత్రమే పరిమితమయ్యాయని, అధికారాలు లేని ఈ పదవులు ఆమె అసంతృప్తిని మరింత పెంచాయని సమాచారం. రాయచోటిలో కూడా ఆమె మాటకు విలువ లేకపోవడంతో, పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.
2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ దెబ్బతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ, అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. శాసనమండలిలో 32 మంది సభ్యులతో బలంగా ఉన్న వైసీపీ, వరుస రాజీనామాలతో క్రమంగా బలహీనపడుతోంది. జకియా ఖానంతో సహా, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు ఇప్పటికే పార్టీని, ఎమ్మెల్సీ పదవులను వదిలిపెట్టారు. అయితే, ఈ రాజీనామాలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఇంతవరకు ఆమోదించలేదు. ఎన్నికలకు ముందు పార్టీని ధిక్కరించిన వారిపై ఆఘమేఘాల మీద అనర్హతా వేటు వేసిన చైర్మన్ వేగం, రాజీనామాల విషయంలో కనిపించడం లేదు. రాజీనామా చేసిన నాయకులు మనసు మార్చుకుంటారనే ఆశతో వైసీపీ నాయకత్వం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ “అందితే జుట్టు, లేకపోతే కాళ్లు” అనేలా ఉంటున్న వైఖరితో వైసీపీ రాజకీయ వర్గాల్లో నవ్వులపాలవుతోంది.
Also Read: Agniveer Ministers Salute: వీర జవాన్ కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
Zakia Khanam joins BJP: జకియా ఖానం రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు, పార్టీలో అంతర్గత సమస్యలే కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆమె, బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకునే దిశగా అడుగులు వేశారు. శాసనమండలిలో ఎన్డీఏ కూటమి బలం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇటీవల ఐదుగురు ఎన్డీఏ అభ్యర్థులు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి గమనార్హం. జకియా ఖానం చేరికతో బీజేపీకి, ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గంలో బలం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఈ వరుస రాజీనామాలపై ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యం. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో జగన్‌మోహన్‌రెడ్డి విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జకియా ఖానం విషయంలో.. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరిన తీరు, వైసీపీని కలవర పరిచే అంశం.
ఎన్డీఏ కూటమి బలపడుతున్న ఈ తరుణంలో, వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలు ఉంటాయా? జగన్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.