YS Jagan: జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, మొత్తానికి రాజకీయాన్ని రప్ప రప్పలాడించారు! ఆ ప్రెస్‌మీట్ చూసిన పలువురు పరిశీలకులు… ఎన్నికల సమయంలో తలకు గులకరాయి తగిలిన ఎఫెక్ట్ ఇదన్నమాట! అంటూ చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని, ప్రజాస్వామ్యం పరారైపోయిందని, శాంతిభద్రతలు శూన్యమైపోయాయని గగ్గోలు పెట్టారు జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ప్రజల హామీలు అమలు చేయడం లేదని ఆరోపణలు చేశారు. అంతటితో ఆగలేదు, ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకే వస్తున్నారంటూ తనకు తానే “సూపర్ స్టార్” ప్రతిపక్ష నేతగా సర్టిఫికెట్ జారీ చేసుకున్నారు! నిజానికి ప్రతిపక్ష నేతే ప్రజల వద్దకు వెళ్తారు ఎక్కడైనా. విచిత్రంగా ప్రజలే తన వద్దకు రావాలని జగన్ కోరుకుంటున్నారు. నలుగురు వైసీపీ కార్యకర్తలు ఆకుపచ్చ కండువాలు వేసుకుని వచ్చి ఫొటోలు దిగితే.. వారే రైతులని భావిస్తుంటారు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి స్కిట్లు తానే చేయించి, తానే మోసపోతుంటారు.
ఇక ఇవాల్టి జగన్ ప్రెస్‌మీట్ చూస్తే… గులకరాయి ఎఫెక్ట్ వల్ల గత ఐదేళ్ల అరాచక పాలన ఆయనకు అస్సలు గుర్తులేదని అర్థమౌతోంది. చంద్రబాబును జైల్లో పెట్టి, టీడీపీని తుడిచిపెట్టాలని ప్లాన్ చేసిన విషయం, డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య, డాక్టర్ సుధాకర్ గుండెపోటు, ఎంపీ రఘురామకృష్ణరాజు అరికాళ్ల వాపు… ఇవేవీ జగన్‌కు గుర్తు రాకపోవడం… గులకరాయి ఎఫెక్టే అయ్యిండే అవకాశం ఉంది! అందుకే వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు అన్యాయమని గోల చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మతిమరుపు మాయలో, ఐదేళ్ల అరాచక పాలన గురించి మర్చిపోయి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ కొత్తగా మాట్లాడుతున్నారు.
Also Read: Mahaa News Conclave: ఎన్టీఆర్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో పశువుల వసతి గృహాలు
అసలు జగన్ ఈ ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం ఎవరనుకుంటున్నారు? బందరు డాన్ పేర్ని నాని. ఆయన చీకట్లో కన్ను కొడితే చాలు.. రప్పా రప్పా అయిపోవాల్సిందే అంటారు. మొన్న వైసీపీ జెడ్పీటీసీ హారిక.. గుడివాడలో చేసిన పొలిటికల్ షోతో ఆమెను వైసీపీలో మరో మహానటిగా అందరూ గుర్తించారు. అయితే హారిక వ్యవహారాన్ని స్టేట్ వైడ్ ఇష్యూగా మార్చి, కులం తీసుకొచ్చి, రాష్ట్రమంతా రచ్చ చేస్తే బాగుంటుందని పేర్ని నాని మొన్న ఓ సలహా పడేశారు పార్టీకి. మళ్లీ తన సలహా జగన్‌కు చేరుతుందో లేదో అన్న అనుమానంతో తాను ఫోల్ కాల్ మాట్లాడుతుండగా ఆయనే వీడియో తీయించుకుని బయటకు లీక్ చేశారు. అంటే పేర్ని నాని ప్లాన్‌ని ఇవాళ ప్రెస్మీట్లో జగన్ అమలు చేశారనమాట. ఇక మహిళా ఎమ్మెల్యేపై నల్లపరెడ్డి బూతులకు సమర్థింపులు, రప్పా రప్పా బెదిరింపులకు మద్ధతు, డీఐజీలు మాఫియా డాన్లు అంటూ కించపరచడాలు, చంద్రబాబు మరో మూడేళ్లలో ఎగిరిపోతాడంటూ ప్రేలాపనలు, అప్రజాస్వామ్యం, విష సంప్రదాయం అంటూ పెద్ద పెద్ద మాటలు, మేలుకో, తెలుసుకో, సరిదిద్దుకో అంటూ నీతి వాక్యాలు, మొత్తానికి తన ఐదేళ్ల అరాచక పాలనలో ఏం జరిగిందో అస్సలు గుర్తులేని గజినీలా, రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ప్రవర్తించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రప్పా రప్పా నరుకుతాం అంటే తప్పేముందబ్బా.. సినిమా డైలాగే కదా… అంటూ మరోసారి తన తలతిక్క వాదనని సమర్థించుకున్నారు. మరి
‘చీకట్లో కన్నుకొడితే… సైలెంట్‌గా పని అయిపోవాలి’ అంటూ పేర్ని చేసిన ఫ్యాక్షన్ వ్యాఖ్యల సంగతేంటి అంటారా? అవి కూడా సినిమా డైలాగుల కింద లెక్కగట్టినట్టే అనుకోవాలి మనం. అలా జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్.. ఆసాంతం అసత్యాలతో సాగింది అంటున్నారు పరిశీలకులు.