Yoga Day Special Story: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. విశాఖ ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెందిర ప్రసాద్ ఏర్పాట్ల వివరాలను సీఎంకు వివరించారు. యోగా డేలో పాల్గొనే వారి కోసం మొత్తం 607 సచివాలయాల సిబ్బంది సమన్వయం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఉదయం 6:30 నుంచి 8:00 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని కూడా సూచించారు. భద్రత, వీఐపీల రాకపోకలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. మొత్తం 22 అంశాల్లో రికార్డు బ్రేక్ చేసేలా ప్రణాళిక రూపొందించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక యోగా డే సందర్భంగా ఏపీ లక్ష్య సాధనలో, యోగాంధ్ర సాధనలో మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ సైతం భాగస్వామ్యం అవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మహా గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చెప్తున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రా లక్ష్య సాధనలో తొలి అడుగుగా ఏపీ ప్రజల్ని యోగా వైపు మళ్లించేందుకు మహా గ్రూప్ తన వంతు పాత్ర వహిస్తోంది.
Also Read: cm revanth reddy: తెలంగాణ మహిళలు గూగుల్ కు పోటీగా నిలుస్తున్నారు
Yoga Day Special Story: ఇక విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగా నేర్చుకున్నవారు చేతులెత్తమని అడగగా, అందరూ చేతులెత్తడంతో.. ఆశ్చర్యపోయిన చంద్రబాబు… “నమ్మమంటారా? నా మీద ఒట్టా?” అని నవ్విస్తూ అన్నారు. గతంలో మోసపోయిన సంఘటనలను ప్రస్తావిస్తూ, “2019 ఎన్నికలకు ముందు బాబాయికి గుండెపోటు అనగానే నమ్మాను. ఆనాడే కుట్రలను పసిగట్టి, దోషులను పట్టుకుని జైల్లో పెట్టి ఉంటే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లమా?” అంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ని ఉద్దేశిస్తూ… “రాష్ట్రంలో భూతం లేదని గ్యారెంటీ ఇస్తున్నా. ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ యోగా డే కార్యక్రమంతో ఏపీ ప్రపంచ రికార్డు సృష్టించనుందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోడీతో పాటు దౌత్యాధికారులు, విదేశీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు సీఎం.