YCP Kompalo Kumpatlu: వైసీపీలో ఉన్న భర్తలు వివాదాల్లో ఇరుక్కోవడమో, లేదంటే కేసుల్లో ఇరుక్కుని జైలుకు పోవడమో జరుగుతోంటే.. వారి భార్యలను రాజకీయంలోకి లాగుతూ వైసీపీ ఏం సాధించాలని అనుకుంటుందో తెలీదు కానీ.. వారి కుటుంబాలు మాత్రం ఛిన్నాభిన్నం అవుతున్నాయి. నందిగం సురేష్ జైల్లో ఉంటే ఆయన భార్య “నెక్ట్స్ నేనే హోం మిస్టర్” అనే ఊహల్లో ఉన్నారు. ఊహల వరకూ పరిమితమైతే సమస్య లేదు. కానీ ఆమె అందరికీ ఫోన్లు చేస్తూ.. ఈ సంగతి చెప్పుకుని మురిసిపోతున్నారు. ఆ కాల్స్ లీకైపోతున్నాయి. నందిగం సురేష్ ఆల్రెడీ ఎంపీగా చేశారు. ఇప్పుడు నా భర్తకు కాదు.. నాకే టిక్కెట్ అంటూ.. ఆయన భార్య పోటీకి వస్తే.. మరి నందగం సురేష్ రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలి? కానీ ఇవేవీ ఆలోచించని వైసీపీ నేతలు సురేష్ భార్య బేబమ్మను ఆకాశానికెత్తేస్తూ ఆమెలో లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నారు. రేపు నందిగం సురేష్ బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తే.. బేబమ్మ చేసిన నిర్వాకానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక వైసీపీలో క్రేజీ అండ్ రొమాంటిక్ లీడర్ దువ్వాడ శ్రీనివాస్ కొంపలోనూ కుంపటి రాజేసింది వైసీపీ. 2024 ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణికి వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఆమె స్థానంలో దువ్వాడ శ్రీనివాస్‌ను తిరిగి ఇంచార్జ్‌గా నియమించింది. దీనిపై అసంతృప్తి చెందిన వాణి, తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా టెక్కలి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకే ఎసరు పెడుతుందా అంటూ మరింత రగిలిపోయిన దువ్వాడ.. దివ్వెల మాధురిని మరింతగా చేరదీసి, ఆమెతోనే సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. అలా దువ్వాడ కుటుంబం నాశనం అయిపోయింది. ఈ ఎపిసోడ్ అంతటితో ఆగలేదు. తాజాగా వైసీపీ నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడంతో.. మిగిలిన కథను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్లీ తెరపై ప్రత్యక్షం అయ్యారట దువ్వాడ వాణి. ఎలాగో దువ్వాడ సస్సెండ్ అయ్యాడు కాబట్టి, వ్యక్తిగతంగా తాను నష్టపోయా కాబట్టి, పార్టీనే తనని ఆదుకోవాలని, ఇప్పుడైనా తనని టెక్కలికి ఇంచార్జ్‌ని చేయాలని.. మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారట. జగన్ మనసు మార్చుకుని కబురు పంపితే.. తిరిగి టెక్కలిలో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశలు పెట్టుకున్న దువ్వాడ శ్రీనుకి.. భార్యా గండం తప్పేలా లేదని టెక్కలిలో చర్చించుకుంటున్నారట.
Also Read: Palakurthi Jhansi Reddy: ముదిరి పాకాన పడ్డ పాలకుర్తి రాజకీయం!
YCP Kompalo Kumpatlu: తాజాగా వల్లభనేని వంశీ కుటుంబంలో జగన్ మార్క్ చిచ్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. గన్నవరం ఇంచార్జ్‌గా వంశీ స్థానంలో ఆయన భార్యను నియమిస్తామని ప్రచారం ప్రారంభించారు. వంశీ భార్య పంకజశ్రీకి గన్నవరం ఇంచార్జ్ పోస్ట్ ఇస్తారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి. వల్లభనేని వంశీ కేసుల్లో ఇరుక్కున్నందున ఆయన బయట తిరగడం కష్టమని, ఆయనకు అన్యాయం జరగకుండా.. ఆయన భార్యకు ఇంచార్జ్ పోస్టు ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. వంశీకి ఇప్పటికే కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. (తాజాగా మెడికల్ బెయిల్‌పై బయటకొచ్చి విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. మిగిలిన ఒకట్రెండు కేసుల్లోనూ బెయిల్ వస్తే ఆస్పత్రి నుండి నేరుగా గన్నవరానికి చేరుకునే చాన్స్ ఉంది.) ఇలాంటి సమయంలో ఆయన్ను ఇంచార్జ్‌గా తప్పించి ఆయన భార్యకు చాన్స్ ఇస్తామని చెప్పడం కుట్రేనని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే వంశీ మనసులో ఏముందో తెలీదు. ఆయన జైలు నుండి బయటపడ్డా.. ఇకపై రాజకీయాల్లో కొనసాగుతారో లేదో అనుమానమే. అదీకాక వంశీ ఎప్పుడూ తన భార్య పంకజశ్రీని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయలేదు. ఇప్పుడు వైసీపీ నేతలు ఆమెకు ఏం చెప్పి ఒప్పించారో కానీ, ఆమె రాజకీయ రంగప్రవేశానికి రెడీ అయిపోయారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంకజశ్రీ నిర్ణయాన్ని వంశీ కనుక వ్యతిరేకిస్తే.. మరో కుటుంబంలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీ సాధించినట్టే.