YCP Cast Trap On JSP: ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయా? వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం.. జనసేన పార్టీని, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా కుల రాజకీయాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి, ప్రతి వివాదాన్ని కులంతో ముడిపెట్టే వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఈ వ్యూహంతో జనసేనపై ఇతర కులాల్లో వ్యతిరేకత సృష్టించాలని వైసీపీ భావిస్తోంది. కానీ, గతంలో ఇలాంటి కుల రాజకీయాల వల్లే వైసీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అయినప్పటికీ వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోకుండా, అదే దారిలో వెళ్తోందన్న విమర్శ వ్యక్తమవుతోంది.
మచిలీపట్నం ఘటన ఈ కుట్రలకు ఓ ఉదాహరణ. ఓ ఆర్ఎంపీ వైద్యుడు పవన్ కల్యాణ్‌ను బూతులు తిట్టిన వీడియో వైరల్ కాగా, ఆవేశంతో జనసైనికులు ఆయనపై దాడి చేసి క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనని కులం కోణంలోకి టర్న్ చేసి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. దీంతో పవన్ కల్యాణ్ జనసైనికులకు హెచ్చరికలు జారీ చేస్తూ, రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్ప… ఆవేశంతో ఘర్షణలకు దిగవద్దని సూచించారు. ఈ ఘటనపై పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్.
Also Read: Uttar pradesh: రెండోసారి కరిచిన కుక్కకు జీవితఖైదు.. ఉత్తరప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం
వైసీపీ ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ద్వారా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కోనసీమలో వైసీపీ అధికారంలో ఉండగా.. ఇదే తరహా కుల రాజకీయాలతో అల్లర్లకు ఆజ్యం పోసింది. సొంత మంత్రి ఇంటిని కూడా తగలబెట్టించుకునేలా చేసింది. అయినా వైసీపీ బావుకుందేమీ లేదు. వైసీపీ కుట్రలను తిప్పి కొడుతూ జనం దారుణంగా ఓడించారు. ఎన్నికల ఫలితాల నుంచి పాఠం నేర్చుకోకుండా వైసీపీ నేటికీ అదే దారిలో కొనసాగుతోంది. దీనివల్ల ఆ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నా… వైసీపీ పంథా వైసీపీదే.
పవన్ కల్యాణ్ సూచనల మేరకు, జనసైనికులు రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా పోరాడాలని, కుట్రలకు లొంగిపోతే రాష్ట్రానికి, పార్టీకి నష్టమని గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. వైసీపీ వ్యూహాలు వారినే దెబ్బతీసే అవకాశముందని, జనసేన ఈ ట్రాప్‌లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని నొక్కిచెబుతున్నారు.