Who is Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పూనకాలే పూనకాలు. ఇక పూజలు, పాలాభిషేకాలు చేసి తమ దేవుడి మీద భక్తిని చాటుకుంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ కావడంతో వారి అభిమాన నటుడు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి ఏళ్లు గడుస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల ఆకలి తీరిస్తూ… జూలై 24న హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 భాషలలో విడుదలవబోతోంది. ఇంతకీ ఈ హరిహర రాయలు ఎవరు? అతని చారిత్రాత్మక నేపథ్యం ఏమిటి? ఆ పాత్రలో జనసేనాని ఎలా నటించారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ యోధుని చారిత్రాత్మక నేపథ్యం ఏంటో, పవన్ ఎందుకు ఈ పాత్రని ఎంచుకున్నారో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
హరిహర వీరమల్లు సినిమాకు మూలాలు తెలియాలంటే… విజయనగర సామ్రాజ్య స్థాపన మొదలైన 11వ శతాబ్దంకు మనం వెళ్లాల్సిందే. విజయనగర సామ్రాజ్యం అనగానే శ్రీ కృష్ణదేవరాయలు గుర్తుకు వస్తారు. కానీ ఈ సామ్రాజ్యాన్ని నిర్మించింది శ్రీ కృష్ణదేవరాయలు కాదని చరిత్ర చెప్పుతోంది. అంతకు మూడు తరాల ముందు హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి హరిహర రాయలు చాలా ఇబ్బందులు పడ్డారు. కాకతీయ చక్రవర్తి వద్ద పనిచేసి, అటునుంచి ఆనగొంది సంస్థానంలో కొలువుదీరి ఉండగా.. ఢిల్లీ సుల్తాన్‌కు బంధీగా చిక్కారు. ఆ తర్వాత అదే సుల్తానుల వద్ద నమ్మకంగా పనిచేస్తూ.. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఆ సుల్తాన్‌లనే ఓడించి, అనేక ఆటంకాలను అధిగమించి, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
Also Read: Journalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!
Who is Veeramallu: భారతదేశాన్ని వశపర్చుకునేందుకు దండెత్తిన విదేశీయుల్లో ముఖ్యులు మహ్మదీయ సుల్తానులు. వీరు క్రమంగా ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. దేశ సంపదను కొల్లగొడుతూనే మన సంప్రదాయాలను కాలరాస్తూ ఇస్లామ్ మత వ్యాప్తి మొదలుపెట్టారు. 13వ శతాబ్దం వచ్చే నాటికి దక్షిణ భారతదేశంలోని హిందూ రాజులపై దండెత్తడం ప్రారంభించారు. అలా అనేక రాజ్యాలను కొల్లగొట్టి కాకతీయ సామ్రాజ్యంపై యుద్ధం శంఖం పూరించారు. 1323లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఓడించి.. ఆ రాజ్యాన్ని కూడా వశపర్చుకున్నారు. ఇదే సమయంలో ప్రతాపరుద్రుడి వద్ద హరిహర రాయలు, అతని సోదరుడు బుక్క రాయలు కోశాధికారులుగా పనిచేసేవారు. సామ్రాజ్యం కాకతీయుల చేజారిపోవడంతో ఆ సోదరులిద్దరూ కంపిలి అనే రాజ్యంలో ఆనగొంది సంస్థానంలో చేరారు. కానీ మూడేళ్లకే ఢిల్లీ సుల్తాన్ ఆనగొంది సంస్థానంపై కూడా దాడి చేశారు. ఆ సమయంలో హరిహర, బుక్కా సోదరులిద్దరినీ బంధించి ఢిల్లీకి తరలించారు. అయితే ఒక రోజు పెద్ద గాలి దుమారం వచ్చి.. సుల్తాన్ సైన్యం చెల్లాచెదురైంది. ఆ సమయంలో తప్పించుకుని పారిపోయేందుకు అవకాశం ఉన్నా… ఈ సోదరులిద్దరూ పారిపోలేదు. దాంతో సుల్తాన్ మెప్పుకోలుగా వారికి ఢిల్లీ ఆస్థానంలో కొన్ని బాధ్యతలు అప్పగించారు. కాలక్రమంలో.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో.. వారిద్దరూ కూడా మతం మార్చుకున్నారు. ఢిల్లీ సుల్తాన్‌ని మెప్పించి సుల్తానుల అధీనంలో ఉన్న కంపిలి రాజ్యానికి అధిపతులు అయ్యారు.
కంపిలిలో పరిపాలన మొదలుపెట్టిన హరిహర, బుక్కాలిద్దరూ అక్కడ పరిస్థితులు చక్కదిద్దారు. కొద్దికాలానికే అక్కడి ప్రజలను వారివైపు తిప్పుకున్నారు. అదను చూసుకుని ఢిల్లీ సుల్తాన్ నిర్ణయాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని ఢిల్లీ సుల్తాన్‌నే దెబ్బకొట్టారు. కంపిలి పూర్తిగా ఈ సోదరుల చేతిలోకి వచ్చిన తర్వాత 1336 సంవత్సరంలో వీరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలా విజయనగర సామ్రాజ్యం ఆరంభం జరిగింది. ఈ అన్నదమ్ములిద్దరూ విద్యారణ్య స్వామి సహకారంతో మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించారు. విద్యారణ్య స్వామిజీ సూచనలతో విజయనగర సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించారు. మొదట్లో తుంగభద్రా నదీతీరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న వీరు, నెమ్మదిగా మలబార్, కొంకణ తీరాన్ని కూడా వశపర్చుకున్నారు.
Also Read: Delhi: అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకం
Who is Veeramallu: విజయనగర సామ్రాజ్య స్థాపనకు కర్త, కర్మ, క్రియ అయిన హరిహర రాయలు సంగమ రాజవంశానికి చెందినవాడు. ఇతనికి కంపన్న, బుక్క, ముదప్ప, మరప్ప అనే నలుగురు సోదరులున్నారు. ఈ నలుగురు సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని బలపర్చడంలో హరిహర రాయలకు దోహదపడ్డారు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశం, సాళువ వంశం, తుళువ వంశం, అరవీడు వంశాలు పాలించాయి. విజయనగర సామ్రాజ్యానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన శ్రీ కృష్ణదేవరాయలు తుళువ వంశానికి చెందినవాడు. అయితే హరిహర రాయలు హిందూ ధర్మం కోసం నిలబడ్డ యోధుడిగా గుర్తింపు పొందారు. హిందూ సనాతన ధర్మాన్ని కాలరాయడం, సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నాలు చేయడం, అలాగే హిందూ వేషధారణను మార్చేందుకు ఢిల్లీ సుల్తాన్‌లు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాడు హరిహర రాయలు. అదే స్ఫూర్తితో ఆ యోధుడి పాత్రలో నటించేందుకు పవన్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఇది సినీ వర్గాలు, విశ్లేషకుల్లో ఉన్న చర్చ మాత్రమే. ఇదే హరిహర వీరమల్లు కథ అని కానీ, పవన్ కళ్యాణ్ పోషిస్తున్న రోల్ హరిహర రాయలుదే అని కానీ మూవీ టీమ్ ఎక్కడా రివీల్ చేయలేదన్న విషయాన్ని గమనించాలి.
ఏది ఏమైనా.. సినిమా ట్రైలర్‌లో కనబడుతున్న ఛాయల్ని బట్టి చూస్తే.. సనాతన ధర్మ రక్షణ యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడన్న అర్థం వచ్చేలానే ఉంది. ఇప్పుడు ఇదే బీజేపీని ఆకర్షిస్తోన్న అంశం కూడా. ఇప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ వీరగాథని తెరకెక్కించగా.. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా దుమ్మురేపింది ఆ చిత్రం. ఇప్పుడు వారణాసిలో హరిహర వీరమల్లు ఈవెంట్‌ని జరుపుతుండటం, దానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతుండటం చూస్తే… వీరమల్లు తుపాన్ ఈ నెల 24న థియేటర్లను ఎలా కుదిపేయబోతోందో ఊహలకు అంతు చిక్కడం లేదంటున్నారు సినీ పరిశీలకులు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి జాతీయ స్థాయి అంటే పాన్ ఇండియా లీడర్‌గా పాపులారిటీ వచ్చేసింది. ఈ చిత్రంతో సినీ హీరోగా కూడా ఆయన మొదటి సారి పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకోబోతుండటం విశేషం.