Who is BJP President : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలంగా కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఓ సుదీర్ఘ చర్చకు తెర లేచింది. ప్రస్తుత సారధి కిషన్ రెడ్డి తర్వాత ఆ పదవి చేపట్టబోయే వారి పేర్లలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ పేర్లు బలంగా వినిపించాయి. రానురాను ఇప్పుడు ఆ పేర్లు కాస్త షార్ట్‌లిస్ట్ అయిపోయాయి. ఇద్దరు నాయకులు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్లు మాత్రమే బలంగా ప్రచారంలోకి వచ్చాయి. రేపు మాపు అధ్యక్ష పదవి ప్రకటన అంటూ వార్తలు వస్తున్నా జాప్యం కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరినీ కాదని బీజేపీ పెద్దలు ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పలేం కానీ, ఇప్పటికైతే వీరిలో ఎవరు రాష్ట్ర పార్టీ అధినాయకుడు కాబోతున్నారన్న చర్చ మాత్రం విపరీతంగా జరుగుతోంది.
ఉప్పు-నిప్పు ఎలా ఉంటాయో అర్థం చేసుకునేవారు ప్రస్తుత బీజేపీ రాజకీయాల్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ బంధం గురించి కూడా అర్థం చేసుకోగలరు. ఆది నుంచే ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలదీ కరీంనగర్ జిల్లా కావడం మరో విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక సాధారణ ఎన్నికల్లో ఎంపీగా మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాజేందర్ గెలిచి ఉండొచ్చు గానీ, తన రాజకీయ జీవితమంతా తన పుట్టిన గడ్డైన కరీంనగర్‌లోనే కొనసాగింది. ఈటెల బీజేపీలోకి అడుగు పెట్టిన నాటి నుంచే బండి సంజయ్ వెర్సస్ ఈటెల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలిచింది.
ఈ ఇద్దరూ నేరుగా పేర్లు పెట్టుకుని పరస్పర ఆరోపణలు చేసుకోకపోయినా, ఎప్పుడూ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉంటారని తరచూ వారి కామెంట్లను బట్టి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లెవ్వరైనా అర్థం చేసుకోగలరు. అయితే మోడీ, షా దగ్గర ఈటెల పేరే పరిశీలనలో ఉన్నట్టు ఒక చర్చ జరుగుతుండగా, ఈటెలను అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకునే యత్నాలు కూడా పార్టీలో అంతర్గతంగా బలంగా జరుగుతున్నట్టుగా ఓ ప్రచారమైతే ముమ్మరంగా జరుగుతోంది.
Also Read: Indian Student: ఆప్ నేత ఇంత తీవ్ర విషాదం.. కెనడాలో ఆప్ నేత కుమార్తె అనుమానాస్పద మృతి.
Who is BJP President: ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావు, అరుణ వీళ్లంతా పార్టీలో కొత్తవాళ్లు కావడంతో వారికి గనుక సారథ్య బాధ్యతలప్పగిస్తే, రాష్ట్ర పార్టీలో తమ ఆధిపత్యానికి గండి పడుతుందేమోనన్న భయం, ఆందోళన ఆర్‌ఎస్‌ఎస్ మూలాలతో పార్టీలో ఎదిగిన వారిలో ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. దీంతో కొందరికి ఇంత కాలం సంజయ్‌తో పెద్దగా పొసగకపోయినా ఇప్పుడు మాత్రం ఈటెల కంటే సంజయే బెటర్ కదా అని వారంతా సమర్థిస్తూ, సంజయ్‌ని బలపరుస్తున్నట్టుగా మరో ప్రచారం ఊపందుకుంది. కానీ మోడీ, షా, నడ్డా పరిశీలనలో మాత్రం ఈటెల పేరుపైనే ఎక్కువ చర్చ జరుగుతుందనేది మరో ప్రచారం. ఇక మరోవైపు తాను అధ్యక్ష పదవి రేసులో లేనట్టు బండి సంజయ్ చెప్పినప్పటికీ ఆయన పేరు కూడా బలంగానే వినిపిస్తోంది.
కాగా ఈ మధ్య ఈటెల కూడా అసహనానికి గురవడం, ఆమధ్య ఒకరిపై చేయిచేసుకున్న ఘటనతో పాటు తాను సారధిగా బాధ్యతలు చేపట్టక ముందే క్రమశిక్షణా చర్యల గురించి మాట్లాడుతుండటం కూడా ఆయన ప్రత్యర్థులు అస్త్రాలుగా మలచుకునే యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అధిష్ఠానం గుడ్‌లుక్స్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న ఈటెలకు బీజేపీ రాష్ట్ర రథసారథి పదవి దక్కుతుందా…? లేక, మళ్లీ బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చి జవసత్వాలు నింపిన ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్‌నే తిరిగి నియమిస్తుందా…? అనే ఊహాగానాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
